Saturday, January 29, 2011

Nadipinchu Naa Naava

నడిపించు నా నావ, నడి సంద్రమున దేవ
నవ జీవన మార్గమున, నా జన్మ తరియింప 

నా జీవిత తీరమున, నా అపజయ భారమున 
నలిగిన నా హృదయమును, నడిపించుము లోతునకు 
నాయాత్మ విరబూయ, నా దీక్ష ఫలియింప 
నా నావలో కాలిడుము, నా సేవ జేకొనుము                                     || నడిపించు నా నావ ||

రాత్రంతయు శ్రమపడినా, రాలేదు ప్రభు జయము 
రహదారులు వెదకినను, రాదాయెను  ప్రతిఫలము 
రక్షించు నీ సిలువ, రమణీయ లోతులలో 
రాతనాలను వెదకుటలో, రాజిల్లు నా పడవ                                      || నడిపించు నా నావ ||

ఆత్మార్పణ చేయకయే, ఆశించితి నీ చెలిమి 
అహమును ప్రేమించుచునే, అరసితి ప్రభు నీ కలిమి 
ఆశ నిరశాయే, ఆవేదనేదురాయే
ఆధ్యాత్మిక లేమిగని, అల్లాడే నా వలలు                                           || నడిపించు నా నావ ||

ప్రభు మార్గము విడచితిని, ప్రార్థించుట మానితిని 
ప్రభు వాక్యము వదలితిని, పరమార్థము మరచితిని
ప్రపంచ నటనలలో, ప్రావీణ్యమును  బొంది
ఫలహీనుడనై ఇపుడు, పాటింతు నీ మాట                                      || నడిపించు నా నావ ||

లోతైన జలములలో, లోతున వినబడు స్వరమా 
లోబడుటను  నేర్పించి, లోపంబులు సవరించి
లోనున్న ఈవులలో, లోటైన నా బ్రతుకున్ 
లోపించని యర్పణగా, లోకేశ చేయుమయా                                     || నడిపించు నా నావ || 

ప్రభు యేసుని శిష్యుడనై, ప్రభు ప్రేమలో పాదుకొని
ప్రకటింటును లోకములో, పరిశుద్ధుని ప్రేమ కథ
పరమాత్మ ప్రోక్షణతో, పరిపూర్ణ సమర్పణతో
ప్రాణంబును ప్రభు కొరకు, పానార్పణము చేతు                                   || నడిపించు నా నావ ||

No comments:

Post a Comment